ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వస్తువులను డెలివరీ చేయనున్న అమెజాన్‌

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వస్తువులను డెలివరీ చేయనుంది. ఈ మేరకు అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఇవాళ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇకపై భారత్‌లోని 20కి పైగా నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో కస్టమర్లకు వస్తువులను డెలివరీ చేయనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. అందులో భాగంగానే 2025 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 10వేల ఎలక్ట్రిక్‌ డెలివరీ వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది. ఇక ఈ ఏడాది ముందుగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పూణె, నాగ్‌పూర్‌, కోయంబత్తూర్‌ తదితర నగరాల్లో ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని అమెజాన్‌ తెలిపింది. ఈ క్రమంలో 2030 వరకు ప్రపంచ వ్యాప్తంగా 1 లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాలను వస్తువుల డెలివరీ కోసం ఉపయోగిస్తామని, దీంతో పర్యావరణ పరిరక్షణకు కొంత వరకు సహాయం చేసిన వారమవుతామని అమెజాన్‌ తెలిపింది.