కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఈశాన్యమధ్యప్రదేశ్‌ వరకు.. మధ్య మహారాష్ట్ర ఉత్తర మరాఠ్వాడా మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. 


ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండలు మండుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.2 డిగ్రీలు, గాలిలో తేమ 30 శాతంగా నమోదైంది.ఇదిలాఉండగా కామారెడ్డి జిల్లాకేంద్రంతోపాటు లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది.